గ్రామాభివృద్ధికే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని గంగాదేవిపల్లిలా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో భాగంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచుతున్నట్లు తెలిపారు. నిధులు పక్కదారి పట్టించే సర్పంచులపై కలెక్టర్లు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చే దాతలను ప్రోత్సహించాల్సిందిగా పేర్కొన్నారు. పంచాయతీల్లో అందరూ భాగస్వామ్యం అయ్యేందుకు నాలుగు స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్లు అందని 420 గ్రామాలకు త్వరలోనే ట్రాక్టర్లు అందిస్తామన్నారు.