నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతుంది. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు ఈ నియోజకవర్గానికి రాబోతుంది. రామప్ప రిజర్వాయర్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతకు రంగారావుపల్లె వద్ద చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశలోని ఐదో ప్యాకేజీ పంపుహౌస్ (రంగరాయచెరువు ప్రాజెక్టు) నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే సాగునీ టి శాఖ ఇంజినీర్లు ఈ పంపుహౌస్‌లోని ఒక మోటర్ ట్రయల్న్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో రెండో మోటర్ ట్రయల్న్ జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రతి సంవత్సరం 131 రోజుల పాటు రెండు మోటర్లతో ఎత్తిపోయడం ద్వారా నర్సంపేట నియోజకవర్గానికి రెండు టీఎంసీల నీరు అందనుంది. రంగారావుపల్లె వద్ద ఇదే పంపుహౌస్‌ను ఆనుకుని చేపట్టిన రామప్ప- పాకాల ప్రాజెక్టు పంపుహౌస్ నిర్మాణం పూర్తయితే కొద్ది నెలల్లో ఈ నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఇంకో మూడు టీఎంసీల నీరు చేరనుంది. వచ్చే వానాకాలం నుంచి ఈ రెండు పంపుహౌస్‌ల్లోని నాలుగు మోటర్లతో ఎత్తిపోతల ద్వారా ఏటా ఐదు టీఎంసీల దేవాదుల నీరు నర్సంపేటకు అందనుంది. ప్రస్తుతం రామప్ప రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలకు సిద్ధమైన రంగరాయచెరువు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సాగునీటి శాఖ అధికారులు సన్నాహాలు చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పదిహేను రోజుల్లోపు వచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే పెద్ది వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే రంగరాయచెరువు ప్రాజెక్టుతో సుమారు 35 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రామప్ప- పాకాల ప్రాజెక్టు పూర్తయ్యాక మరో 35వేల ఎకరాలకు దేవాదుల నీరు అందనుంది. రంగరాయచెరువు, రామప్ప- పాకాల ప్రాజెక్టుతో నర్సంపేట నియోజవర్గం లో మొత్తం 70 వేల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ నుంచి నీరు అందేలా సాగునీటి శాఖ ఇంజినీర్లు డిజైన్ చేశారు.
గోదా‘రంగ’వైభోగం!