ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కీలక తీర్పు

2012 సెప్టెంబర్‌ 5న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది.


ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని కోర్టు నిర్ధారించడం సరికాదని తీర్పులో పేర్కొంది. ‘పబ్లిక్‌ పోస్ట్‌ల్లో నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని చట్టంలో స్పష్టంగా ఉంది. అలాగే, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన కూడా లేదు. అయినా, ఒకవేళ రాష్ట్రాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, కచ్చితమైన గణాంకాలు సేకరించి, తద్వారా ఆయా వర్గాలను సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. రిజర్వేషన్లు కల్పించవచ్చు’ అని ధర్మాసనం వివరించింది.


రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలపై కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది. ‘రాజ్యాంగంలోని 16(4), ఆర్టికల్‌ 16(4ఏ) అధికరణలు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ప్రభుత్వాలకు కల్పిస్తున్నాయి. ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని విశ్వసిస్తే ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయా అధికరణాల్లో ఆ విషయం స్పష్టంగా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది.